Contact

Text

Friday 20 June 2014

బాబు వచ్చె.. జాబు పోయె!.

22:03 - By Unknown 0


సీన్ రివర్స్
 
గృహ నిర్మాణ శాఖలో 158 మందికి ఉద్వాసన!
నెలాఖరులోగా ఇంటికి పంపాలని ఆదేశాలు
ఆందోళనలో ఉద్యోగులు

 
 

అనంతపురం : జాబు రావాలంటే బాబు రావాలి.. ఇంటికో ఉద్యోగం చంద్రబాబుతోనే సాధ్యం.. ఇలా సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగు తమ్ముళ్లు ఉపన్యాసాలు, గోడ రాతలతో ఊదరగొట్టారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే సీన్ రివర్స్ అవుతోంది. వివిధ శాఖల్లో తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇంటికి పంపే పనిలో పడ్డారు. ఇప్పటికే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకంలో దాదాపు 850 మంది ఔట్ సోర్సింగ్ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని నిర్ణయించిన చంద్రబాబు.. తాజాగా గృహ నిర్మాణ శాఖపై దృష్టి సారించారు. ఆ శాఖలో ఔట్ సోర్సింగ్ కింద జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 30 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు (ఎఈలు), 99 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు, 22 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఏడుగురు కార్యాలయ సిబ్బందిని మొత్తంగా 158 మందిని ఇంటికి పంపటానికి రంగం సిద్ధం చేశారు. జూన్ 30 కల్లా వారిని తొలగించాంటూ గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్‌కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అయితే ఖాళీ అయ్యే ఈ పోస్టులను అలాగే ఖాళీగా ఉంచుతారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అనే విషయంపై ప్రభుత్వం వద్ద కానీ, అధికారుల వద్ద కానీ స్పష్టత లేదు.

ఇంటి నిర్మాణాలు పూర్తవుతాయా?

 వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు గృహ నిర్మాణ శాఖకు ప్రాధాన్యత లేదు. స్థానిక నియోజకవర్గాలకు  
 కొద్దిపాటి ఇళ్లు మాత్రమే మంజూరు చేసేవారు. కేంద్ర, రాష్ట్రాలు మంజూరు చేసే గృహాలు ఏడాదికి వెయ్యి ఇళ్లకు మించేవి కావు. అయితే 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రాన్ని పూరిగుడిసెల్లేని రాష్ట్రంగా చూడాలని భావించారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ పథకం కింద మూడు విడతల్లో ప్రతి నియోజకవర్గానికి వేలాది ఇళ్లు మంజూరు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే మూడు విడతల్లో అనంతపురం జిల్లాకు ఇందిరమ్మ పథకం కింద దాదాపు 4,61,471 ఇళ్లు మంజూరు చేశారు. ఒక్కసారిగా గృహ నిర్మాణ శాఖకు ప్రాధాన్యత పెరగడంతో ఉద్యోగులకు పనిభారం కూడా ఎక్కువైంది. ఈ క్రమంలో నామమాత్రంగా ఉన్న శాశ్వత ఉద్యోగులకు తోడు ఔట్‌సోర్సింగ్ కింద అర్హతలను బట్టి ఉద్యోగులను నియమించారు. రాజశేఖర్‌రెడ్డి నిర్ణయంతో గూడులేని నిరుపేదలకు సొంత గూడు దొరకడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి దొరికినట్లైంది. ఈ క్రమంలో సిబ్బంది ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించారు.


 జిల్లాలో మొత్తం 4,61,471 గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 2,86,107 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక 2,24,335 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా, 61,772 ఇంటి నిర్మాణాలు అసలు ప్రారంభమే కాలేదు. ఈ పరిస్థితుల్లో గృహ నిర్మాణ శాఖలో కీలక పాత్ర పోషించే ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించడానికి రంగం సిద్ధం చేయడంతో అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ నిర్మాణాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పెరిగిన సిమెంటు ధరలు, సమయానికి రాని బిల్లులతో నిర్మాణాలు పూర్తి చేసుకోలేని లబ్ధిదారులు ఇప్పుడు సిబ్బంది పర్యవేక్షణ తగ్గిపోతే ఇంటి నిర్మాణాలు ఎలా పూర్తి చేసుకుంటారో అర్థం కాని పరిస్థితి. 158 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఇంటికి పంపిన పక్షంలో ఆ శాఖలో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే సిబ్బంది నామమాత్రంగానే ఉన్నారు. వర్క్‌ఇన్‌స్పెక్టర్లు 24 మంది, ఏఈలు 31, సీనియర్ అసిస్టెంట్లు నలుగురు, జూనియర్ అసిస్టెంట్లు ముగ్గురు, అసిస్టెంట్ మేనేజర్లు ముగ్గురు, ఒక మేనేజర్ మాత్రమే ఉంటారు. పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్న రోజుల్లోనే జిల్లాలో నత్తనడకన సాగిన ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడు ఏమేరకు పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకమే. నెలాఖరుకు ఇంటి దారి పట్టించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని తెలుసుకున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు.  

 ఔట్‌సోర్సింగ్ సిబ్బందిలో టెన్షన్

 ఒక్కోశాఖలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని చంద్రబాబు నాయుడు తొలగిస్తూ పోతుండడంతో ఇతర శాఖల్లో ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురౌతున్నారు. ఎప్పుడు తమ శాఖపై బాబు కన్నుపడుతుందో.. తమ ఉద్యోగాలకు ఎప్పుడు ఉద్వాసన పలుకుతారో తెలియక వారు టెన్షన్‌కు గురౌతున్నారు. ఈ విషయమై గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని, పరిశీలిస్తున్నామని తెలిపారు.
 

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top