పవర్ స్టార్ పవన్ కల్యాన్ గురించి వస్తున్న ఊహాగానాల పరంపరలో తెలుగుదేశం అభిమాన మీడియా సంస్థలు రాస్తున్న వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. పవన్ ను తెలుగుదేశం పోపులో కరివేపాకు గా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి ఆ మీడియా వర్గాలు. సూటిగా చెప్పాలంటే... పవన్ ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకుతాడని, ఆయన స్థాపించిన జనసేన తరపున అభ్యర్థులు ఎవరూ పోటీలో ఉండరని, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, లోక్ సత్తాలతో కూడిన కూటమికి పవన్ మద్దతు ప్రకటిస్తాడని ఆ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి తక్కువ సమయం ఉందని కాబట్టి జనసేన తరపున అభ్యర్థులు నిలబడే అవకాశాలు లేవనే అభిప్రాయాన్ని పవన్ మాటగా చెబుతూ తన మాటగా వివరిస్తోంది తెలుగుదేశం అనుకూల మీడియా! ఓవరాల్ ఈ మీడియా తాపత్రయం ఏమిటంటే... పవన్ పార్టీ ఉండాలి, అయితే ఇప్పుడు అభ్యర్థులు నిలబడకూడదు. ఎందుకంటే, ఒకవేళ ఇప్పుడు పవన్ కల్యాన్ సీమాంధ్రలో అభ్యర్థులను పెట్టాలని ప్రయత్నిస్తే తెలుగుదేశంలో ఒక ఉప్పెన చెలరేగే అవకాశం ఉంది! ఇప్పటికే కాంగ్రెస్ వలసవాదులకు 30 సీట్లు వరకూ పోగామిగిలింది 145 సీట్లు వీటిలో బీజేపీకి తప్పనిసరిగా కొన్ని సీట్లు కేటాయించాలి. వాటి సంఖ్య 20 వరకూ అయినా ఉంటుంది. ఆ సీట్లను బీజేపీకి ఇస్తేనే రేపు కేంద్రంలో స్వర్గసుఖాలు దక్కుతాయి. వీటన్నింటినీ లెస్ చేయగా మిగిలింది 125 సీట్లు మరి వాటిలో ఇప్పుడు పవన్ గనుక ఒక పాతిక సీట్ల కోసం పట్టుబడితే.. తెలుగుదేశం పార్టీకి లాకౌట్ బోర్డు పెట్టేసుకోవాల్సిందే! కాబట్టి పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్లను అడగకూడదు... బేషరతుగా తెలుగుదేశం కూటమికి మద్దతు పలకాలని మీడియా ఆశిస్తోంది. పవన్ కు కూడా ఇలాంటి ఉద్దేశమే ఉందని ముందుగానే ప్రచారం చేసేస్తోంది! పవన్ కు ఎలాగూ 2019 ఉండనే ఉంది కదా.. అంటూ ఆయనను ఊరిస్తోంది కూడా! ఇప్పటికైతే పవన్ కల్యాన్ మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. ఆయన అభిమానులేమో ఆయనది నిస్వార్థ పూరిత రాజకీయం అంటున్నారు. మీడియానేమో ఈ సారికి అభ్యర్థులే ఉండరని వార్తలు రాసేస్తోంది. ఈ పరిణామాలన్నీ ఎలా తయారవుతున్నాయంటే.. ఒకవేళ పవన్ వచ్చే ఎన్నికల్లో తన వాళ్లను కొంతమంది బరిలో దించాలని అనుకొంటే ఆయన ను జనాలు ఒక స్వార్థపరుడి కింద జమకట్టే పరిస్థితి రావొచ్చు! పవన్ అభిమానులు ఎలాంటి పరిణామానికైనా రెడీగా ఉండాలని, తమ లెక్కలకు అనుగుణంగా నడుచుకోకపోతే.. పవన్ ను ఒక స్వార్థపరుడిగా, సీట్లను ఆశించి రాజకీయాల్లోకి వస్తున్న వాడిగా చిత్రీకరించేందుకు కూడా ఆ మీడియా వెనుకాడకపోవచ్చని, అప్పడు ఆ వార్తా పత్రికల, ఆమీడియా సంస్థల దిష్టిబొమ్మలను దహనం చేసి ప్రయోజనం ఏమీ ఉండదని, పవన్ ఇప్పటికే ఒక వలయంలోకి ప్రవేశించాడని ఇక ఆయన నిమిత్త మాత్రుడేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు!

About the Author

0 comments:
Post a Comment