ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అడ్డం తగిలింది చంద్రబాబేనంటూ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి నినదించింది. కాంగ్రెస్ పార్టీ వంతపాడింది. తద్వారా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నానా కష్టాలూ పడింది గడచిన ఐదేళ్ళలో. ఇప్పుడు విభజన జరిగిపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కూడా. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చేసినా, టీడీపీ అధినేత చంద్రబాబుని ఇరకాటంలో పెట్టేయడం మానలేదు. ‘విభజనతో కరెంటు కష్టాలు వస్తాయి..’ అని చంద్రబాబు, మాజీ సీఎం కిరణ్, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ఇలా సీమాంధ్ర నేతలు చాలామంది చెప్పారు. ఆ కష్టాలే ఇప్పుడు తెలంగాణను వెంటాడుతున్నాయి. కరెంటు కష్టాల నుంచి తెలంగాణకు వెసులుబాటు కల్పిస్తూ, ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ‘అదెలా కుదురుతుంది.. ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయమెలా చేస్తారు..’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చంద్రబాబు ప్రశ్నిస్తే, ‘చంద్రబాబు తెలంగాణ ప్రజల్ని చీకట్లోకి నెట్టేయడానికి చూస్తున్నారు..’ అంటూ కొత్త ప్రచారానికి తెరలేపింది తెలంగాణ రాష్ట్ర సమితి. ‘తెలంగాణకు కరెంటు కష్టాలు తప్పవు.. అయితే అది కొద్ది కాలమే.. సిద్ధంగా వుండాలి..’ అని ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి వాస్తవాల్ని తెలంగాణ ప్రజల ముందుంచింది.. ఆ పార్టీ చిత్తశుద్ధిని నమ్మి, తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించారు. ఇప్పుడేమో ఆ కష్టాలకి కారణం చంద్రబాబేనంటూ టీఆర్‌ఎస్ ప్రచారానికి తెరలేపేసరికి, తెలంగాణ టీడీపీ నేతలు షాక్‌కి గురవుతున్నారు. ‘ఈ మాట మేం గతంలోనే చెప్పాం.. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయ్యే కరెంట్‌ని లాక్కోవాలనుకోవడం ఎలా సమంజసం.?’ అని ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు తెలంగాణ టీడీపీ నేతలు. అలాగని చంద్రబాబునీ వారు నిలదీసే పరిస్థితి లేదు. 1956కి ముందున్న తెలంగాణ కావాలి.. అని గతంలో టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఆ లెక్కన భద్రాచలం, అశ్వారావుపేట, మునగాల డివిజన్లను ఆంధ్రప్రదేశ్‌కి వదిలేయాల్సి వుంది. కానీ విభజన ప్రక్రియలో అలా జరగలేదు. పోలవరం ప్రాజెక్టు కోసం 7 ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపైనా టీఆర్‌ఎస్ రాద్ధాంతం చేస్తోంది. ‘అప్పుడు అలా అన్నారు కదా..’ అని టీఆర్‌ఎస్‌ని నిలదీసే పరిస్థితి లేదు. ఇక్కడా టీడీపీనే ఇరకాటంలో పడిపోతోంది. మొత్తంగా చూస్తే, విభజనకి ముందూ, విభజనకి తర్వాత తెలంగాణలో చంద్రబాబు అడ్డంగా బుక్కయిపోతున్నారు. అప్పుడూ ఇప్పుడూ చంద్రబాబుని తెలంగాణ ద్రోహిగానే చూపించే ప్రయత్నమైతే జరుగుతోన్న విషయం స్పష్టం కన్పిస్తోంది. కానీ, చంద్రబాబు ఏమీ చేయలేని దయనీయ స్థితిలో వున్నారు. కారణం ఆయన జపిస్తున్న రెండు కళ్ళ సిద్ధాంతమే.
0 comments:
Post a Comment