Contact

Text

Sunday 6 April 2014

బాబుతో జర భద్రం

03:19 - By Unknown 0


బాబుతో జర భద్రం
 పోలంపల్లి ఆంజనేయులు
2004 సాధారణ ఎన్నికలు. పొత్తులో భాగంగా  తెలుగుదేశం పార్టీ  తెలంగాణలో బీజేపీకి 15 అసెంబ్లీ సీట్లు కేటాయించింది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నిలబడ్డారు. ఇక్కడ టీడీపీ టిక్కెట్టు ఆశించిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు బిరుదు రాజమల్లు  రెబల్‌గా బరిలో నిలిచారు. బీజేపీ ఫిర్యాదుతో రాజమల్లును టీడీపీ నుంచి చంద్రబాబు బహిష్కరించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్ధతుతో టీఆర్‌ఎస్ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డి 59,697 ఓట్లతో గెలుపొందారు. రాజమల్లు 35,933 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గుజ్జుల 23,660 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఎన్నికలు ముగిసిన వెంటనే బిరుదు రాజమల్లు మళ్లీ టీడీపీలో కీలక నేత అయ్యారు.
 

 పొత్తు ఉంటుంది... నిత్యం పరస్పర చర్చలూ కొనసాగుతుంటాయి... అదనీఇదనీ నామినేషన్ గడువు వరకు సాగదీస్తారు. చివరిరోజున పొత్తు  కుదుర్చుకున్న పార్టీకి కేటాయించిన స్థానాల్లోనూ గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేసేస్తారు... వారికి బాబుగారే స్వయంగా బీఫామ్స్ అందజేస్తారు. అన్నింటా వెన్నుపోటు తత్వాన్ని ఒంటబట్టించుకున్న చంద్రబాబు సహజ నీతి సూత్రమిది. స్నేహహస్తం అందించిన పార్టీని కూడా పొత్తు పేర చిత్తు చేసి ‘పచ్చ’పార్టీ లబ్ధిపొందటమే ఆయన లక్ష్యం. తనదైన ఈ సూత్రాన్ని గతంలో ఆచరించిన ఆయన ఇప్పుడు బీజేపీకి కూడా అదే అనుభవాన్ని రుచి చూపబోతున్నారు.  పొత్తు అవసరం తనదైనా, బీజేపీకి అప్రధాన సీట్లను కేటాయించి కీలక  నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలిపేందుకు ఆయన చాలారోజులుగా యత్నిస్తున్నారు. ఈ పన్నాగం పసిగట్టిన తెలంగాణ బీజేపీ నేతలు విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా... బలమైన లాబీయింగ్‌తో నరేంద్రమోడీ, మరో అగ్రనేత అరుణ్‌జైట్లీలను ఒప్పించి, తన కుట్రను అమలు చేసే యత్నంలో ఉన్నారు.  ఇదే విషయాన్ని బిజేపి నేతలు నగరంలో ఉన్న బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి ప్రకాశ్ జవదేకర్ దృష్టికీ తీసుకెళ్లారు.
 
 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఇచ్చిన మక్తల్ సీటులో టీడీపీ బీఫారంతో పోటీ చేసిన కొత్తకోట దయాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ... టీఆర్‌ఎస్ నాలుగోస్థానానికి పరిమితమైంది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ ఓ మైనారిటీ నాయకున్ని పోటీకి నిలిపితే డబ్బులున్న సీమాంధ్ర నేత సుధీష్ రాంబొట్లకు బీఫారం ఇచ్చారు. ఆయన మూడో స్థానానికి పరిమితమైనా తరువాత టీడీపీ అధికార ప్రతినిధి అయ్యారు.  మహేశ్వరంలో రెబల్‌గా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డికి ఎన్నికల తరువాత నగర టీడీపీ అధ్యక్ష పదవి వరించింది. బీఫారంతో  నామినేషన్ దాఖలు చేసి చంద్రబాబు మాటలు నమ్మి ఉపసంహరించుకొన్న మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్, ముషీరాబాద్ నేత ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు,  సనత్‌నగర్ నాయకుడు పి.ఎల్. శ్రీనివాస్‌లకు రాజకీయంగా మొండిచెయ్యి ఎదురైంది.
 
 ఒకచేత్తో పొత్తు సీట్లు... మరో చేత్తో పార్టీ బీఫారాలు
 
 2009 ఎన్నికల్లో నామినేషన్లకు చివరి రోజున చంద్రబాబు నివాసం నుంచి ఆయా జిల్లాల్లో  రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ నాయకులకు ఫోన్లు వెళ్లాయి. వెంటనే నాయకులంతా బీఫారాలు తీసుకెళ్లి ఎన్నికల అధికారులకు సమర్పించారు కూడా. మక్తల్, ముషీరాబాద్, హిమాయత్‌నగర్, గోషామహల్, కార్వాన్, యాకుత్‌పురా, సంగారెడ్డి, కామారెడ్డి, ముధోల్, పెద్దపల్లి, మంథని, రామగుండం, ఇందుర్తి, మెట్‌పల్లి, హన్మకొండ, శాయంపేట, పటాన్‌చెరు, రామన్నపేట తదితర 30 అసెంబ్లీ స్థానాలతో పాటు సికింద్రాబాద్, వరంగల్ లోక్‌సభ స్థానాలకు  కూడా బీఫారాలు జారీ చేశారు. దీంతో షాకైన టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం నాయకులు చంద్రబాబుతో మంతనాలు జరిపితే కేసీఆర్ మీద అనుమానంతో అలా చేశానని, నామినేషన్‌లు వేసిన వారిని ఉపసంహరించుకోమని ఆదేశాలిస్తానని చెప్పారు.  మేరకు ఓ ప్రకటన చేసినప్పటికీ,  విజయావకాశాలున్న స్థానాల్లో అభ్యర్థులను కొనసాగమని లోపాయికారిగా  ఆదేశించారు.   కొన్ని చోట్ల నామినేషన్లు ఉపసంహరించుకున్నా రెబల్స్ గానీ, టీడీపీ యంత్రాంగం గానీ టీఆర్‌ఎస్‌కు సహకరించలేదు. అందుకే 45 చోట్ల పోటీ చేసిన టీఆర్‌ఎస్ కేవలం 10 స్థానాల్లోనే గెలిచింది.
 
 ఇప్పుడూ అదే సీనా..?
 
 నామినేషన్ల గడువు ముగిసే సమయం ముంచుకొస్తోంది. అయినా సీట్ల విషయంలో ఏకాభిప్రాయం రాలేదు. ఈలోపు బీజేపీ గట్టిగా కోరుతున్న కొన్ని సీట్లలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు కూడా. మంచిరోజులు అయిపోతున్నాయని బయటకు చెపుతున్నా, పార్టీ కార్యాలయం నుంచి స్పష్టమైన సందేశం ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ మెలిక పెడుతున్న 12 అసెంబ్లీ సీట్లలో కూడా టీడీపీ నాయకులు నామినేషన్లు వేస్తున్నారు. మహేశ్వరం, ఉప్పల్, ఎల్‌బీ నగర్, కూకట్‌పల్లి వంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్నారు.  టీడీపీ హైదరాబాద్ జిల్లా కమిటీ శనివారం తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన సమావేశమై ఒంటరిగానే పోటీ చేయాలని, అన్ని స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయాలని కూడా తీర్మానించింది. ఆదివారం మరోసారి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చే సి పొత్తును వ్యతిరేకించాలని, బలవంతంగా పొత్తును రుద్దితే రెబల్స్‌గా పోటీ చేయాలని తీర్మానించింది.
 
 2009 ఎన్నికలు. అదే పెద్దపల్లి నియోజకవర్గం.  ఈసారి పొత్తులు మారాయి.  మహాకూటమిలో భాగంగా పెద్దపల్లి సీటును టీఆర్‌ఎస్‌కు కేటాయించారు. టీఆర్‌ఎస్ తరుపున సి. సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ నుంచి గీట్ల ముకుందరెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల రామకష్ణారెడ్డి పోటీ చేశారు.  నామినేషన్ల చివరి రోజు మార్చి 30న చంద్రబాబు   సీహెచ్. విజయ రమణారావుకు టీడీపీ బీఫారాన్ని ఇచ్చారు. తరువాత పరిణామాల్లో బాబు టీడీపీ రెబెల్ అభ్యర్థిపై ఉత్తుత్తి సస్పెన్షన్ వేటు వేశారు. సైకిల్ గుర్తుతోనే పోటీ చేసిన విజయరమణారావు  64,319 ఓట్లు సాధించి ఘన విజయం సాధిస్తే... టీఆర్‌ఎస్ మూడోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 40,837 ఓట్లతో రెండోస్థానంలో నిలిచింది. గెలిచిన వెంటనే టీడీపీ ఖాతాలో ఓ సీటు పెరిగింది. ప్రస్తుతం విజయ రమణారావు టీడీపీకి జిల్లా అధ్యక్షుడయ్యారు.
 

Tags:
About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top