ఎన్నికల ఫలితాల కోసం చాలా మంది చాలా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం అభిమానులు ఆ పార్టీ విజయం కోసం, భాజపా కార్యకర్తలు ఆ పార్టీ ఫలితాల కోసం, వైకాపా జనాలు ఆ పార్టీ గెలిచే స్థానాల కోసం ఆశగా అంచనాలు వేసుకుంటున్నారు. వీరు కాక, వేరే బాపతు జనాలు కూడా వున్నారు. పార్టీలో వుంటూనే రివర్స్ ఫలితాలు ఆశించేవారు. పార్టీ వదలి పోలేక, కానీ పార్టీలో సరైన గుర్తింపు లేక, లేదా పార్టీ నేతలపై అసంతృప్తి వున్న బాపతు జనాలు వీరు. ఇలాంటి జనాలు దాదాపు అన్ని పార్టీల్లోనూ వుంటారు. అయితే బయటపడరు. వారి వారి వ్యవహారాలను చూసి మనమే అంచనా వేసుకోవాలంతే. రాయలసీమలో తెలుగుదేశానికి సంబంధించి సిఎమ్ రమేష్ బాధితులు, ఆంధ్ర ప్రాంతంలో సుజనా చౌదరి బాధితులు చాలానే వున్నారని వినికిడి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కనుక పొరపాటున అధికారానికి దూరమైందో, వీళ్లిద్దరిని దులిపేసే అవకాశం వస్తుందని భావిస్తున్నారట వారు. టికెట్ లు కేటాయింపులో ఈ ఇద్దరి ప్రభావమే ఎక్కువ వుందని, అందుకే ఈ తరహా ఎదురు చూపులని తెలుస్తోంది. ఇక నందమూరి హరికృష్ణ సంగతి అందరికీ తెలిసిందే, ఇప్పుడు బాబుకు అధికారానికి దూరమైతే, ఆయన గొంతు గ్యారంటీగా లేస్తుంది. పవన్ ను తేవడం, అతగాడికి అగ్రాసనం వేయడం కూడా కొంతమంది పార్టీ జనాలకు ఇష్టం లేదు. వారంతా ఇప్పుడు అవకాశం వస్తే ఓ మాట అనడానికి వెనుకాడరు. ఇక తెరాస సంగతి ఇలాంటిదే. ఉద్యమకారులను విస్మరించి డబ్బు చేసిన వారికి కేసిఆర్ టికెట్ లు ఇచ్చారన్న ఆరోపణలు వుండనే వున్నాయి. అందువల్ల ఏమైనా తేడా జరిగిందో కేసిఆర్ ను ఓ లెక్కలో దులిపేస్తారు. ఇక వైకాపా సంగతి కూడా అలాంటిదే. పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన వారు చాలా మంది వున్నారు. జగన్ కేవలం తన స్వంత అంచనాలు, సర్వేలు ఆధారంగా టికెట్ లు ఇచ్చారు. ఈ విషయంలో ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోలేదు. ఆ అసంతృప్తి కొందరిలో వుంది. వారంతా వైకాపా కనుక అధికారం అదుకోకపోతే, ధ్వజమెత్తేందుకు రెడీగా వున్నారు. భాజపా సంగతి మరీ సూపర్. తెలంగాణలో భాజపా నేతలు చాలా అసంతృప్తితో వున్నారు. వారి మెడలు వంచి మరీ తెదేపాతో తాళి కట్టించారు. ఇప్పుడు సీట్లు ఏమీ రాకపోతే వుంటుంది..మజా..ఓ లెక్కలో ఏకుతారు. అదే సమయంలొ భాజపా కు ఇచ్చిన సీట్లు కనుక పోతే, తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎదురు ఏకేయడానికి రెడీగా వున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో రెడ్లను కాదని కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇతరులకు అప్పగించింది. దాంతో జనా అండ్ కో చాలా అసంతృప్తిగా వున్నారు.ఇప్పుడు సీట్లు బాగానే వస్తాయంటున్నారు కాబట్టి ఓకె. లేకుంటే అప్పుడుంటుంది మాటల యుద్ధం. ఇలా దాదాపు అన్ని పార్టీల్లో ఇదే తరహా భావనలు కనిపిస్తున్నాయి -
0 comments:
Post a Comment