‘కాస్త ప్రచారం చేసి పెట్టరాదా..’ అని స్వయంగా సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళి మరీ, ప్రచారానికి రప్పించుకున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. మల్కాజిగిరి సహా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని పోటీలోకి దింపాలనుకున్నా, చంద్రబాబు వద్దని వారించడంతోనే పవన్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. ఇక, ఎన్నికల్లో పవన్ ప్రచారం ఇటు టీడీపీకీ, అటు బీజేపీకీ బాగా కలిసొచ్చింది తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌లలో. ఆ విషయం చంద్రబాబుకీ తెలుసు. అందుకే ఎన్నికల ఫలితాలొచ్చాక పవన్‌కి ప్రత్యేకంగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని పీఠమెక్కిన నరేంద్ర మోడీ కూడా, పవన్‌ని ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ‘మహానాడు’ వేదికగా పవన్‌ని అభినందించారు. పవన్ విజ్ఞతను ప్రదర్శించారనీ, టీడీపీ - బీజేపీ కూటమికి మద్దతివ్వడం మంచి నిర్ణయమనీ కొనియాడారు చంద్రబాబు. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అవుతోన్న చంద్రబాబు, ముఖ్యమంత్రి అయ్యాక కూడా పరిపాలనలో పవన్ విధానాల్ని పరిగణలోకి తీసుకుంటే మంచిదని పవన్ అభిమానులు భావిస్తున్నారు. మరి, చంద్రబాబు రానున్న రోజుల్లో కూడా పవన్‌ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారా.? వేచి చూడాల్సిందే.
0 comments:
Post a Comment