Contact

Text

Monday 19 May 2014

ఇది ప్రతిష్టాత్మక ప్రతిపక్షం

23:46 - By Unknown 0


వైఎస్‌ఆర్‌సీపీ మొదటిసారి సాధారణ ఎన్నికల బరిలోకి దిగింది. ఇది ఒంటరి పోరాటం. జగన్ నాయకత్వంలో జరిగిన ఈ సమరంలో ఆ పార్టీ సాధించిన విజయాలు అసాధారణమైనవి. జరిగినది భీకరమైన పోరాటం. వైఎస్‌ఆర్‌సీపీ 67 అసెంబ్లీ స్థానాలూ (ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొత్తం స్థానాలు 175), ఎనిమిది లోక్‌సభ స్థానాలూ కైవసం చేసుకుంది.

 

ఎన్నికలొస్తాయి, వెళతాయి. ఫలితాలు కొందరికి మోదాన్నీ, ఇంకొందరికి ఖేదాన్నీ కలిగించడం సహజం. కానీ ప్రజా జీవితంలో ఉన్నవారికి ఎలాంటి విలువలు ఉన్నాయో అంచనా వేసుకునేందుకు ఇదో మంచి అవకాశం. ‘గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు లెక్కించడం’ అన్నదో సామెత. ధనిక వర్గ దోపిడీ వ్యవస్థలో అనుక్షణం దాని సంరక్షణకు తోడ్పడే కుహనా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవడం కూడా అలాంటిదే. ఈ ధనిక వర్గ వ్యవస్థలో గెలుపోటములను కూడా అన్ని వర్గాల బతుకులను కలుషితం చేసే ఆ చట్రం పరిధిలోనే అంచనా వేసుకోవాలి.  ఈ క్రమంలోనే ప్రత్యర్థుల మీద లేనిపోని కేసులు నిమిషాలలో పుట్టుకొస్తాయి. కోర్టుల పరిధిలో ఉన్న సొంత మనుషుల కేసులు సైతం రెప్పపాటులో మాఫీ అయిపోతాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చట్రంలోకి ప్రత్యర్థులు నెట్టివేసిన అనేక మందిలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, యువ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఒకరు.
 
కేసులు బలమైనవైతే....!

జగన్ మీద పెట్టిన కేసులు అంత బలమైనవే అయితే, పదహారు మాసాలు నిర్బంధంలో మగ్గిన వ్యక్తిని నిబంధనలను సడలించి, రుజువులకు అతీతంగా, పార్టీ ప్రచారానికి ఇన్ని మాసాల పాటు (బెయిల్ మీదనే అయినా) విడిచి పెట్టి ఉండేవి కావు. ఇక నిర్బంధం నుంచి బయటకు వచ్చాక తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జగన్‌కు వ్యతిరేకంగా రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ఈ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీ ఒంటరిగా(ఒక్క సీపీఎంతో పరిమిత స్థానాలలో చేసుకున్న ఒప్పందం మినహా) పోటీ చేసింది. 1955లో ఆంధ్ర ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వస్తుందన్న అనుమానంతో గంగవైలెత్తిన కాంగ్రెస్ చేసిన దుష్ర్పచారాన్ని మరిపిస్తూ జగన్ మీద ఆ మూడు పార్టీలు ధ్వజమెత్తాయి. జగన్‌కు పార్టీని నిర్మించిన అనుభవం పెద్దగా లేదు. రాజకీయ, సంస్థాగత వ్యవహారాలను బయట నుంచి పరిశీలించడమే తప్ప, ప్రత్యక్ష పాలనానుభవం లేదు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అందలం ఎక్కగల అనుభవం అంతకంటె లేదు. కానీ ఐక్య రాష్ట్రం కోసం గళం విప్పిన నాయకుడాయన. నిరాడంబరంగా, నిండైన పలకరింపుతో, తండ్రి వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ కనిపించేవారు. అందుకే కాస్త కటువుగా అనిపించినా, జగన్ మీద వారు చేసిన ప్రచారం ‘విష పూరితం.’

 విష ప్రచారం
 
ఈ ఎన్నికలలో ఆంధ్రలో పోలింగ్ ముగిసిన మరునాడు యానాం నుంచి ఒక సుప్రసిద్ధ కథకుడు వచ్చి కలిశాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల లో జగన్‌కు వ్యతిరేకంగా ఎంత అనైతికంగా ప్రచారం చేశారో ఆయన నోటి నుంచి విన్న తరువాత విస్తుపోవలసి వచ్చింది. జగన్ పార్టీ గెలిస్తే వారు రాష్ట్రం మీద పడి దోచుకుంటారట. కడప ఫ్యాక్షనిస్టులు ఇప్పటికే విశాఖపట్నం (ఇక్కడ నుంచి విజయమ్మ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు)లో దిగిపోయారట. కానీ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల ఫలితాలను అందుకున్నవారు ఆ ప్రచారాన్ని నమ్మలేదని కూడా ఆ కథకుడు చెప్పారు. ప్రతికూల ప్రచారం ద్వారా విజయం సాధించేందుకు ఆ కూటమి పన్నిన వ్యూహం సఫలం కావడానికే అవకాశాలు ఎక్కువంటూ ఆయన వేసిన అంచనా నిజమైంది.  పార్టీ నిర్మాణం దగ్గర లోటుపాట్లు కావచ్చు, చాలినంత వ్యవధి లేనందువల్ల కావచ్చు, హడావుడిగా జరిగిన కొందరు అభ్యర్థుల ఎంపిక వల్ల కావచ్చు - కొంత బలం తగ్గింది. అయినా వైఎస్‌ఆర్‌సీపీ సాధించిన విజయం ప్రతిష్టాత్మకంగానే ఉంది.

ఒంటరి పోరాటం

వైఎస్‌ఆర్‌సీపీ మొదటిసారి సాధారణ ఎన్నికల బరిలోకి దిగింది. ఇది ఒంటరి పోరాటం. జగన్ నాయకత్వంలో జరిగిన ఈ సమరంలో ఆ పార్టీ సాధించిన విజయాలు అసాధారణమైనవిగానే పరిగణించాలి. పార్టీలోని పెద్దలు, కార్యకర్తలు ఆయనకు అండగా నిలిచారు. జరిగినది భీకరమైన పోరాటం. తీవ్ర వ్యతిరేక ప్రచారం నడుమ వైఎస్‌ఆర్‌సీపీ 67 అసెంబ్లీ స్థానాలూ (ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొత్తం స్థానాలు 175), ఎనిమిది లోక్‌సభ స్థానాలూ కైవసం చేసుకుంది. ఇదే ధనికస్వామ్యాన్ని అడ్డం పెట్టుకునే కావచ్చు; భవిష్యత్తులో జాంబవంతుడి అంగతో వైఎస్‌ఆర్‌సీపీ సంపూర్ణ అధికారం చేపడుతుందని అనుకోవచ్చు. అందుకు ఈ పోరాటమే తొలిమెట్టు. ఈలోగా పార్టీని పటిష్టం చేసుకోవాలి. కుల, మత భేదాలకు అతీతంగా విశాల ప్రాతిపదికన మరింత మందిని సమీకరించాలి. భవిష్యత్తులో సంపూర్ణ అధికారం చేపట్టడం సాధ్యమేనని భరోసా కల్పించే రీతిలోనే ప్రస్తుత ఫలితాలు ఉన్నాయని మరచిపోరాదు.

వారి హామీల మాటేమిటి?

బీజేపీతో కలసి ఈ ఎన్నికలలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నీటి మూటలు కాకతప్పదు. దేశ రెవెన్యూ, ద్రవ్య బడ్జెట్‌లు రెండూ ఘోరమైన లోటుతోనే నడుస్తున్నాయి. ధరల సంగతి చెప్పనక్కరలేదు. కానీ ప్రతి పార్టీ తాను అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ వాగ్దానాలు కురిపించాయి. నిజానికి పీవీ, మన్మోహన్, చంద్రబాబుల ఏలుబడి, ఆ తరువాత బీజేపీ పాలన మన ఆర్థిక రంగాన్ని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టినవే. సంస్కరణల కోసం సంతకం చేయడానికి మన్మోహన్‌సింగైనా కాస్త తటపటాయించారేమోగానీ (ఆర్థికమంత్రిగా), వాటిని అమలు జరపడానికి మొట్టమొదటిగా ముందుకు ఉరికినవాడు చంద్రబాబే. తాను బీసీ వర్గంలో ఒక మెట్టు కిందివాడినేనని మోడీ చెప్పుకుంటున్నా, ఈ ‘చాయ్‌వాలా’ గుజరాత్‌లోని కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలను కాపాడినవాడే. రేపు కేంద్రంలో ఆయన ప్రభుత్వం చేయబోయేది కూడా అదే.

అపవిత్ర పొత్తు కాదా?

బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టబోతున్నది. మత ముద్ర ఉన్న బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. రాష్ట్రంలో తన శక్తీ, పార్టీ శక్తీ పూర్తిగా క్షీణించిందని గుర్తించడం వల్లనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ భయంతోనే బాబూ-మోడీ జోడీ జగన్ పార్టీ మీద దృష్టి కేంద్రీకరించిన సంగతిని ఇప్పటికే జనం గమనించారు. ఇక వైఎస్ మరణానికి కారణమైన ప్రమాదం మీద ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి కావడం ఎలా? అంతకన్నా సహించరాని విషయం ఇంకొకటి ఉంది. మతశక్తులకు ఎన్నడూ చోటు ఇవ్వని ఈ బుద్ధభూమిలో విషబీజాలు చ ల్లడానికి చంద్రబాబు మరోసారి ప్రయత్నించారు. ఇలాంటి కూటమిలో భాగస్వామి కావ డానికి చంద్రబాబు సాహసించడం ఎంత పతనం? వ్యక్తిగత స్థాయిలోనూ, నాయకత్వం విషయంలోనూ బాబూ-మోడీ కూటమికి ముందున్నది ముసళ్ల పండుగే.    
 

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top