Contact

Text

Sunday 18 May 2014

వైసీపీలో భయం భయం :జగన్ జైలుకు

22:43 - By Unknown 0

కొనసాగుదామా? గోడ దూకుదామా?
వైసీపీ తాజా ఎంపీ, ఎమ్మెల్యేల్లో అంతర్మ«థనం
అధికార పార్టీలో చేరితేనే భవిష్యత్తని భావన
అదే దారిలో మున్సిపల్, పరిషత్ నేతల
వైసీపీ ఖమ్మం ఎంపీ, ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ వల
నలుగురికీ పార్టీ నేత ఈటెల ఫోన్

ఎన్నికలు అయ్యాయి! ఎమ్మెల్యేలుగా గెలిచారు! ఇంకా ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేయలేదు! అప్పుడే ముసలం మొదలైంది! కొంతమందిలో అభద్రత మొదలైంది! వారు ఇప్పటికే 'సేఫ్ జోన్లు' వెతుక్కుంటున్నారు! మరికొంతమందికి పిలుపులు వస్తున్నాయి! అరచేతికి ఆరో వేలులా నామమాత్రంగా ఉండే కంటే అధికారంలో భాగస్వాములు కావాలంటూ ఆహ్వానాలు అందుతున్నాయి! తద్వారా, సార్వత్రిక ఎన్నికలకు ముందే మూడు రెక్కలూ తెగిపోయిన 'ఫ్యాన్' ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి! ఇటు తెలంగాణలోనూ అటు సీమాంధ్రలోనూ వైసీపీ పరిస్థితి ఇది! ఖమ్మం జిల్లాలో వైసీపీ ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్లను గెలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడ టీఆర్ఎస్ కంటే వైసీపీయే బలంగా ఉంది. దీంతో ఆ పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలను టీఆర్ఎస్ నేతలు ప్రారంభించినట్లు తెలిసింది. దీనికితోడు, తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీఆర్ఎస్ అధినాయకత్వం.. అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 60. ప్రస్తుతం ఆ పార్టీకి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బోటా బోటీ మెజార్టీని పెంచుకునే వ్యూహానికి టీఆర్ఎస్ పదును పెట్టింది. తమ ఎమ్మెల్యేల సంఖ్యను కనీసం 70 వరకు తీసుకెళ్లడంలో భాగంగా రాజకీయ ప్రత్యర్థులను బలహీనపర్చటానికి పూనుకుంది. ఇందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫోన్లో వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముగ్గురు ఎమ్మెల్యేలు పాయ వెంకటేశ్వర్లు (పినపాక), బానోతు మదన్‌లాల్ (వైరా), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట)తో సంప్రదింపులు జరిపారు. మూకుమ్మడిగా తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. "తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇంకా వైసీపీలో ఉండి ఏం చేస్తారు? మా పార్టీలోకి వస్తే మంచి అవకాశాలను కల్పిస్తాం. మనదే ప్రభుత్వం. కాబట్టి, మీ నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు.
మీ కార్యకర్తలకు, నాయకులకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని మొత్తం మీ చేతుల్లోనే పెడ్తాం. తెలంగాణలో ఎక్కడా వైసీపీ లేదు. మీరు మాత్రం ఆ పార్టీలో ఉండి సాధించేది ఏమిటి? టీఆర్ఎస్‌లోకి వస్తే అంతా కలిసి పనిచేద్దాం'' అని ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ ధ్రువీకరించటం లేదు. టీఆర్ఎస్ తరఫున తమతో ఎవరూ మాట్లాడలేదని, మద్దతు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా తమ వద్దకు రాలేదని వారు చెబుతున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే.. సీమాంధ్రలోని వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి మరోలా ఉంది. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వారిని అభద్రత వెంటాడుతోందని తెలిసింది. 'భవిష్యత్తు' వారిని భయపెడుతోందని, వైసీపీలోనే కొనసాగుదామా? గోడ దూకేద్దామా అనే అంతర్మథనంలో వారు చిక్కుకున్నారని చెబుతున్నారు. 'అధికారాన్ని చేజిక్కించుకుంటామన్న ధైర్యంతో మూడేళ్లుగా జగన్ వెంట నడిచాం. 16 నెలలపాటు ఆయన జైల్లో ఉన్న సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అధికారం కోసం తీవ్రంగా శ్రమించాం. ఇంతా చేస్తే చివరికి ఫలితం ఓటమి. అక్రమాస్తులకు సంబంధించి పలు కేసులు ఎదుర్కొంటోన్న జగన్‌కు అధికారం దక్కలేదు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి..? ఆయన జైలుకు వెళితే తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది?' తదితర అంశాలను ఊహించుకుని వైసీపీ తాజా ప్రజా ప్రతినిధులు ఆందోళనకు గురవుతున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. జగన్ జైలుకు వెళ్లకపోతే ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదురొడ్డి నిలబడవచ్చని, కానీ, ఆయన మళ్లీ జైలుకు వెళ్లడన్న గ్యారెంటీ ఏమీ లేదని మదన పడుతున్నారు. కేవలం ఆయన బెయిలుపైనే బయట ఉన్నాడని, ఒకవేళ ఆయన మళ్లీ జైలుకు వెళితే పార్టీని ముందుకు నడిపించే సత్తా ఎవరికి ఉందని అంతర్మథనం చెందుతున్నారు. ఇక, కేసుల్లో దోషిగా తేలి మళ్లీ జైలుకు వెళితే ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదని, ఇటువంటి పరిస్థితుల్లో అదే పార్టీలో కొనసాగడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గోడ దూకి అధికార పార్టీల్లో చేరితే ఐదేళ్లపాటు ఏదో రకంగా భవిష్యత్తు అయినా ఉంటుందని వారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ తరఫున ఇటీవలి మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు, కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీల్లో అంతర్మథనం మొదలైందని తెలిసింది. అధికారం లేకపోతే తమను ఎవరూ పట్టించుకోరని, ఇలాగే కొనసాగితే ఎటువంటి ఉపయోగం ఉండదని మున్సిపల్, పరిషత్ ప్రతినిధులు, జడ్పీ చైర్మన్లు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఏదో రకంగా అధికార పార్టీలో చేరితే ఐదేళ్లు హాయిగా కొనసాగవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి, వైసీపీ గుర్తింపు పొందిన పార్టీ కాదు. అది కేవలం రిజిస్టర్డ్ పార్టీయే. దీంతో, ప్రతినిధులకు విప్ వర్తించదు. దీంతో, విప్ తమకు వర్తించదని, గోడ దూకినా తమపై కొరఢా ఝళిపించే వాళ్లే ఉండరని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఇటీవల జడ్పీటీసీలుగా ఎన్నికైన వారు సైతం గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఎంపీలు అయితే, సాధ్యమైనంత త్వరగా బీజేపీ లేదా టీడీపీలోకి చేరితే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కొన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు ఇదే దారిలో ఉన్నట్టు వైసీపీలోని నేతలే వివరిస్తున్నారు. జగన్‌ను మళ్లీ జైల్లో పెడితే గెలిచినా తమకు ఎటువంటి ప్రయోజనం ఉండదని, కనీసం ప్రజల వద్దకు వెళ్లి ముఖం చూపించలేమని ఆవేదన చెందుతున్నారు. సీమాంధ్రలో ప్రజా తీర్పు వైసీపీకి అనుకూలంగా వచ్చి ఉంటే జగన్‌ను జైల్లో పెట్టేందుకు కాస్త వెనకాడే అవకాశం ఉండేదని, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, ఈ పరిస్థితుల్లో జగన్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకు ఉంటుందనే ప్రశ్నలు ఆ పార్టీ నేతల్లో ఉదయిస్తున్నాయి. దీంతో, ముందే జాగ్రత్త పడితే మేలని కొందరు నేతలు ఎవరికి వారే అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 21న ఇడుపులపాయలో జరిగే వైసీపీఎల్పీ సమావేశానికి ఎవరు వెళతారో ఎవరు డుమ్మా కొడతారో వేచి చూడాల్సి ఉంది.

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top