గజపతినగరం
: పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. రాష్ట్రం లో శిశు సంక్షేమ శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించిన ఓ ఆడపడుచు..‘తెలుగుదేశం’ తీరుతో కన్నీరు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో కీలకనేతగా ఉన్న పడాల అరుణ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏకపక్ష ధోరణితో కన్నీటిపర్యంతమయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గంలో తనకు జరుగుతున్న అవమానాలను కొంతకాలంగా పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు.
మూడు పార్టీలు మారిన వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చారని, ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన ప్రమేయం లేకుండా అతనికి బీ ఫారాలు ఇవ్వడం దారుణమని అన్నారు. పార్టీ అధినేత గజపతినగరంలో సభ పెడుతున్న విషయం కూడా తనకు తెలియజేయకపోవడం బాధాకరమన్నారు. రెండున్నర దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేశానని, అటువంటి తనకు ఇదేనా ఇచ్చిన గుర్తింపు అంటూ ప్రశ్నించారు. గుర్తింపులేని చోట పని చేయడం కష్టంగా భావించి జిల్లా, రాష్ట్ర పార్టీ కార్యాలయాలకు తన రాజీనామాను పంపిస్తున్నట్లు ప్రకటించారు. అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.

About the Author

0 comments:
Post a Comment