కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహితపై బుధవారం ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అవమానంగా భావించిన బాధితురాలు గురువారం ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం.. రాష్ట్ర రాజధాని కోల్కతా నగరానికి 346 కిలోమీటర్ల దూరంలోని మాల్దా జిల్లాలోని మనక్చక్ ప్రాంతంలో ఈ ఘటన చేసుకుంది. తను ఇంట్లో లేని సమయంలో (బుధవారం) ఓ దుంండగుడు తన భార్యపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి భర్త తెలిపాడు. తను వచ్చిన తర్వాత భార్య జరిగిన విషయాన్ని చెప్పడంతో తాము పోలీసులను ఆశ్రయించేందుకు ప్రయత్నించినట్లు అతడు చెప్పాడు. నిందితునిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత దంపతులకు కంగారు కోర్టు (గ్రామ పెద్దలు) అంగీకరించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని, నిందితుడితో తన భార్యకు క్షమాపణ చెప్పిస్తామని కోర్టు పెద్దలు చెప్పారని బాధితురాలి భర్త పేర్కొన్నాడు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని భరించలేని తన భార్య నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అతడు తెలిపాడు. తీవ్ర గాయాలపాలైన తన భార్య మాల్దా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని బాధితురాలి భర్త చెప్పాడు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు అత్యాచారానికి గురైందా లేదా అనే విషయం పోస్టుమార్టం తర్వాతే తేలుతుందని పోలీసులు చెప్పారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదు.
0 comments:
Post a Comment