‘మీసం తీసేస్తే అచ్చం చిన్నపిల్లాడిలా ఉన్నావు..’ అందామె అతడికేసి నవ్వుతూ చూస్తూ...
అతడి మొహంలో ఒక సిగ్గుదొంతర.
‘నువ్వే తీసెయ్‌మన్నావ్‌గా..’ అని సమాధానం!
‘తీసేస్తే బావుంటావు అనుకొన్నాను... ఇలా ఉంటావని అనుకోలేదు..’
ఆడవాళ్లు ఏమంటున్నారు?!
ఈ విషయం గురించి అనేక సర్వేలు జరిగాయి. ముచ్చటైన మీసం మీద ఆడవారి అభిప్రాయాన్ని తెలుసుకొనే ప్రయత్నాలు జరిగాయి. ఆసియా దేశాల్లోని ఆడవాళ్లకు మీసం మీద మరీ ఎక్కువ వ్యతిరేకత లేదు అయితే నీల్సన్ సర్వే ప్రకారం మీసం, గడ్డం తీసేసి క్లీన్‌షేవ్‌తో కనిపించే మగాళ్లే ఎక్కువగా ఆడవాళ్లను ఆకర్షిస్తున్నారని తేలింది.. పూర్తిగా గడ్డం, మీసం తీసేయడం ఒక విధంగా ఆకట్టుకొనే అంశం అయితే... వాటిని స్టైలిష్‌గా తీర్చిదిద్దడం మరో రకంగా ఆక ర్షణ ! పెదాలకు కిందా పైనా చుట్టూ ఉన్న వెంట్రుకలను ఫ్రెంచ్‌గడ్డంగా మలిచి ఆకట్టుకొనే వారూ ఉన్నారు. అదే నీల్సన్ సంస్థ చుంబనం విషయంలో కూడా ‘మీసం’ గురించి ఆడవాళ్ల అభిప్రాయాలను తీసుకొంది. చుంబనానికి అయితే క్లీన్‌షేవ్ అయితేనే బెటర్ అని వారు వ్యాఖ్యానించారు. అయితే తమ మగాడి మీసాన్ని సెక్సప్పీల్‌గా భావిస్తున్న మహిళలు 64 శాతం మంది ఉన్నారన్న విషయం తెలుసుకొంటే మాత్రం ధైర్యంగా మీసాలు పెంచవచ్చు!
ఉన్నట్టుండి తీసేస్తే పరాయివాడే!
నిత్యం చూస్తున్న మగవాడు ఒక్కసారిగా మీసాలు లేకుండా ప్రత్యక్షం అయితే గుర్తుపట్టడమే కష్టం అవుతుంది. ప్రత్యేకించి భర్త గనుక ఉన్నట్టుండి మీసాలు తీసేసి వస్తే రెండు మూడు రోజుల పాటు పరాయి వ్యక్తితో గడిపినట్టుగా ఉంటుందనే ఆడవాళ్లూ ఉన్నారని అధ్యయన కర్తలు అంటారు.
అవునా... పదిహేను రోజులు భరించాల్సిందే.. తర్వాత మళ్లీ మామూలు అవుతుందిలే...’ అని అతడి ఊరడింపు! మరి పెరగడమూ సులభమే, తీసేయడమూ సులభమే అయినా మగాడి జీవితంలో మీసానిది చాలా ముఖ్యమైన పాత్ర. ఒక అధ్యయనం ప్రకారం ఉదయం లేస్తే షేవ్ చేయాలా? వద్దా? అనేదాని గురించి అత్యంత తీవ్రంగా ఆలోచించే మగవాళ్లు నూటికి 60 మంది.వీరిలో షేవింగ్ చేయడ మనే బద్ధకం ఉన్న వారితో పాటు షేవింగ్ లేకుండా పెరిగిన మీసం, గడ్డంతోనే అందంగా ఉన్నామనుకొని ఫీలవుతూ వాటిని తీసేయడానికి ఇష్టపడని వాళ్లూ చాలా మంది ఉన్నారు.
టెస్టోస్టిరాన్ ప్రభావం అది..
మగవాళ్లలో ప్రతి వంద మిల్లీ లీటర్ల రక్తంలో 300 నుంచి 1200 నానోగ్రాముల టెస్టోస్టిరాన్ ఉంటుంది. పురుషుల మగతనానికి ఇదే ముఖ్యమైన హార్మోను. గడ్డం, మీసాలు పెరగడానికి ఇదే కారణం. స్త్రీలలో కూడా ఈ హార్మోను ఉంటుంది. అయితే అత్యంత అల్పంగా. ప్రతి వంద మిల్లీ లీటర్ల రక్తంలో వంద నానోగ్రాముల పరిమాణంలో ఉంటుంది ఈ హార్మోను. అందుకే ఆడవాళ్లకు గడ్డం మీసం ఉండవు.
ఆఫీసులకు అడ్డం అవుతున్నాయి...
కార్పొరేట్ కల్చర్ మగాడి మీసానికి చేటు తెచ్చింది. అనునిత్యం క్లీన్‌షేవ్ మెయింటెయిన్ చేయకతప్పని పరిస్థితి. అదే నాగరికత, అదే సభ్యత అంటున్న పరిస్థితుల మధ్య ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే రోజు నుంచి అఫీసుకు వెళ్లే ప్రతి రోజూ రేజర్‌కు పనిచెప్పాల్సిన పరిస్థితి.
ప్రాంతాన్ని బట్టి ప్రాధాన్యం...
యూరోపియన్‌దేశాల్లో మీసం పెంచడం కొంచెం అనాగరికతకు నిదర్శనం. ప్రత్యేకమైన అభిరుచి ఉన్న వారు తప్ప ఆ పని చేయరు. దాన్ని అందం అని అనుకోరు. అయితే గుబురు మీసం ఉన్న మగవాడు అవతలి వారిని భయపెట్టగలడనే నమ్మకం అక్కడ కూడా ఉంది. దీంతో అనేక ప్రభుత్వాలు మీసం పెంచే పోలీసులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి! మనదేశంలో కూడా ఉత్తరాది వాళ్లు మీసంతో కనిపించడం కొంచె అరుదు. దక్షిణాది వాళ్లకేమో మీసం మగతనానికి నిర్వచనం. అయితే ఇప్పుడిప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం ఉత్తరాదిన మగాళ్లకు మీసం ప్రత్యేక ఆకర్షణ అవుతోంది, దక్షిణాదిన క్లీన్ షేవ్ కు క్రేజ్ పెరుగుతోంది.
ఎలా ఉండాలి?!
మరి మీసం పెంచేదా, వద్దా? అంటే దానికి సమాధానం చెప్పడం కష్టమే. అఫిషియల్‌గా అడ్డం అయ్యే మీసాన్ని త్యాగం చేయకతప్పదు. అయితే పర్సనాలిటీకి తగ్గట్టుగా పెరిగీ పెరగనట్టుగా, ఉండీ లేన ట్టుగా ఉంచుకోగలగడం మధ్యే మార్గం అని విశ్లేషకులు అంటున్నారు.
0 comments:
Post a Comment