
చిలమత్తూరు, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి టికెట్ల పంపిణీలో టీడీపీ అధిష్టాన వర్గం వైఖరి మండలంలోని ఆ పార్టీ నాయకుల్లో చిచ్చు రగిల్చింది. విభేదాలను పరిష్కరించేందుకు వచ్చిన పరిశీలకుని సమక్షంలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థితికి చేరుకుంది. వివరాలిలా ఉన్నాయి.
మండల పరిధిలోని కోడూరు పంచాయతీలోని మూడు సెగ్మెంట్లకు సంబంధించిన బీ ఫారాలను మాజీ ఎంపీపీ శివప్పకు పార్టీ ముందుగానే అందజేసింది. వాటిలో ఒక దానిని 1వ సెగ్మెంట్‌లో పోటీ చేస్తున్న వెంకటసుబ్బమ్మకు అందజేశారు. కాగా, 2వ సెగ్మెంట్ తరఫున తాను, 3 వ సెగ్మెంట్‌కు తన సోదరుడు నంజుండప్ప పోటీ చేస్తుండడంతో మిగిలిన రెండు బీఫారాలను శివప్ప తనవద్దే ఉంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మండల పార్టీ నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు సుబ్బారెడ్డి పరిశీలకునిగా వచ్చారు.
ఆయన సమక్షంలోనే 2,3 సెగ్మెంట్లకు నామినేషన్ వేసిన టీడీపీ నాయకులు శివప్పపై దాడికి దిగారు. బీ ఫారం ఇవ్వడానికి డబ్బు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు తీవ్రం కావడంతో బస్టాండులోకి వచ్చిన తర్వాత ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఎలా గెలుస్తారో చూద్దామంటూ సవాళ్లు విసురుకున్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎంపీపీ లక్ష్మినారాయణ రెడ్డి జెడ్పీటీసీ టికెట్టు ఖరారైనట్లు తెలియడంతో అతని ప్రత్యర్థి గౌరీశంకర్, ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపునకు ఎట్టి పరిస్థితిలోనూ పనిచేసేది లేదని స్పష్టం చేశారు. తమ ప్రమేయం లేకుండానే పార్టీ తీసుకున్న నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేశారు
0 comments:
Post a Comment