మాగడి రోడ్డులోని తావరకెరె సమీపంలోని కెంపేగౌడ నగరలో నివాసం ఉంటున్న సునీత (29) హత్యకు గురైంది. హంతకుడు, సునీత స్నేహితుడిగా భావిస్తున్న ధనరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విచారణ చేస్తున్నారు. వివరాలు... వివాహిత అయిన సునీతకు 8 ఏళ్ల కుమార్తె (మానసిక అస్వస్థత) ఉంది. భర్త ప్రైవేట్ ఉద్యోగి. రేస్‌కోర్సు రోడ్డులో ఓ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సునీత గురువారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో విధులకు వెళ్లడానికి రేస్‌కోర్సు ప్రాంతానికి వచ్చింది. గేట్ నెంబర్ -3 నుంచి ఫుట్‌పాత్‌పై వెళ్తుండగా ధన రాజ్ అడ్డుకున్నాడు. కొద్ది క్షణాల వ్యవధిలోనే కత్తి తీసుకుని విచక్షణారహితంగా పొడిచాడు.
ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని సునీత గట్టిగా కేకలు వేస్తూ కుప్పకూలిపోయింది. సమీపంలో విధులలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్ల సహ గుర్రపు రేసులు వీక్షించడానికి వస్తున్న వందల మంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతమంది మధ్యలో నుంచి ధనరాజ్ చాకచక్యంగా పారిపోవడానికి యత్నించాడు. దీంతో అప్రమత్తమైన వారు ధనరాజ్‌ను పట్టుకుని చితకబాదడంతో అతను సృహకోల్పోయాడు. సునీతను హుటాహుటిన సమీపంలోని మల్లిగె ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో సునీత మృతి చెందినట్లు డీసీపీ రవికాంత్ గౌడ తెలిపారు. నిందితుడు 17 సార్లు పొడిచినట్లు చెప్పారు. ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సునీత హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉంటే సునీత, ధనరాజ్ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఆరేళ్లుగా పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో ధనరాజ్ ప్రవర్తనతో విసిగిపోయిన సునీత అతని దూరంగా ఉంది. ధనరాజ్ మాట్లాడటానికి ప్రయత్నించిన ఆమె పట్టించుకునేది కాదని సమాచారం. ఈ విషయంపై కక్ష పెంచుకున్న నిందితుడు గురువారం మధ్యాహ్నం సునీతతో మాట్లాడటానికి వచ్చి కత్తితో దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇరువైపుల కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నామని హైగ్రౌండ్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ చెప్పారు. మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
0 comments:
Post a Comment