ఏది వేసుకోవాలో నిర్ణయించుకోవడానికి ఒక సెషన్ నడుస్తుంది. మంచం మీద ఓ నాలుగైదు డ్రెస్సులు పరిచి... ఉదయం దువ్విన తలను చెరపాలి... దువ్వుతూ ఉండగా మధ్యలో ఏదో నల్లగా కొంచెం కనిపిస్తే అది ‘పేను’ కాకపోయినా అవునేమో అనే భ్రమతో, ఆందోళనతో అపుడే పేలు తీసుకోవాలి. జడ వేసి, డ్రెస్ చేసి అద్దానికి పరీక్షలు పెట్టాలి. మళ్లీ మొగుడికి పరీక్షలు పెట్టాలి. బాగుందంటే
ఒప్పుకోరు/ఊరుకోరు. ఏదో ఒక చిన్న మార్పు చెబుదామా అంటే ఫస్ట్ షో సినిమాకు తీసుకున్న టిక్కెట్లు సెకండ్ షోకు పనికిరావంటాడు థియేటర్ వాడు. అది గుర్తొచ్చి బాగుందని చెప్పాలని నిర్ణయిస్తే... ‘ఊరికే లేటవుతుందని అలా చెబుతున్నారు కదా! నిజం చెప్పండ’ని ఆమె పదే పదే ప్రశ్నిస్తే... ‘నిజంగా బాగుంది’ అంటాం. ఆమెలో ఇంకా ఎక్కడో మిగిలి ఉన్న శంకను పోగొట్టేందుకు ‘సాధారణంగా మ్యాచింగ్ వేస్తేనే నీకు బాగుంటుందనుకున్నా, కానీ మ్యాచింగ్ లేకపోయినా కాంట్రాస్ట్ కూడా నీకు బాగా నప్పింది తెలుసా’ అని మనసును కష్టపెట్టి, క్రియేటివిటీని ప్రదర్శించాల్సి వస్తుంది.
డ్రెస్సింగ్ తంతు పూర్తయ్యాక అప్పుడు మళ్లీ ఓ సారి లోనికెళ్లి మేడమ్ మేకప్ మొదలుపెడితే అది పూర్తవడానికి ఇంకొంచెం సమయం... అరగంటే లెండి! జీవితంలో పనిచేయడమే కాదు, టైంపాస్ చేయడం కూడా కష్టమే అనే విషయం కేవలం ఆడవారి వల్లే అర్థమవుతుంది.
ఒక థియరీ ఏంటంటే... మగాళ్ల కంటే స్త్రీలు విజ్ఞులు. సమయం చాలా విలువైనది అని మనం అనుకుంటే సమయం కంటే మా విలువే ఎక్కువన్నది వారి ఆత్మవిశ్వాసం. అందుకే తమ కోసం సమయాన్ని అలా నీళ్లలా ఖర్చు చేస్తారు. ‘ప్రతి ఒక్క మగాడూ ఆడోళ్లు గంటలు గంటలు రెడీ అవుతారని ఊరికే ఆడిపోసుకుంటారు... కానీ వారికి కావాల్సింది రెడీ కావడమే. పురుషుల్లో అత్యధికులు స్త్రీలు సింగారించుకుంటే చూడటానికి ఎక్కువ ఇష్టపడతారు’ అని స్త్రీ జాతి ఆక్షేపిస్తోంది. ‘మగాడిలా లాగు, చొక్కా వేసుకుని రెడీ అవడానికి మాకూ పది నిమిషాలు చాలు బాబూ... కానీ ఏదో మిమ్మల్ని మెప్పిద్దాం అంటే మళ్లీ మాపైనే విసుర్లా’ అని స్త్రీ జాతి ఫీలవుతోంది.
0 comments:
Post a Comment