సినిమా రివ్యూ: లెజెండ్
నటవర్గం: బాలకృష్ణ, జగపతి బాబు, రాధిక ఆంప్టే, సోనాల్ చౌహన్
దర్శకుడు: బోయపాటి శ్రీను
నిర్మాత: అచంట గోపినాథ్, ఆచంట రాము, అనిల్ సుంకర
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
బ్యానర్: 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్
ప్లస్ పాయింట్స్:
జగపతిబాబు, బాలకృష్ణ నటన
డైలాగ్స్
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
మైనస్ పాయింట్స్:
మితిమీరిన హింస
క్లైమాక్స్
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహా సూపర్ హిట్. ఆతర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు సరైన హిట్ లేదు. లెజెండ్ లో జగపతిబాబు రూట్ మార్చి విలన్ రూపంలో కనిపించనున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిక్కి ఉంది. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ రాజకీయంగాను, సినీ కెరీర్ లో ప్రభావం చూపేందుకు లెజెండ్ ఎంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ, బోయపాటిలు సరైన హిట్ కోసం, జగపతిబాబు తనను తాను కొత్తగా అవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ చిత్రం కొంత ప్రాధాన్యత, ఆసక్తిని సొంతం చేసుకుంది. మార్చి 28 శుక్రవారం వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
ఇంట్లో కారం, ఒంట్లో అహంకారం లేకుండా బతకలేననే జితేందర్ (జగపతిబాబు) ముఖ్యమంత్రిపై పదవిపై ఆశలు పెంచుకుంటాడు. అలాంటి జితేందర్ పెళ్లి చూపుల కెళ్లి ఓ వివాదంలో చిక్కుకుంటాడు. ఆ ఊరి పెద్ద (సుమన్) జితేందర్ ను నష్టపరిహారం, క్షమాపణ చెప్పాలని తీర్పు ఇస్తాడు. ఆ ఊరి పెద్ద నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా భార్య (సుహాసిని)ను కుమారుడు కృష్ణ (బాలకృష్ణ)ను కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ వ్యవహారంలో తల్లి చనిపోవడంతో కృష్ణ జితేందర్ తండ్రి, అతని అనుచరులను చంపుతాడు. చిన్నతనంలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో తలదూర్చడం ఇష్టం లేని కారణంగా కృష్ణను పై చదువుల కోసం లండన్ పంపుతాడు. చదువు పూర్తయిన తర్వాత దుబాయ్ లో బిజినెస్ లో స్థిర పడుతాడు. పెళ్లి చేసుకుందామని వచ్చిన కృష్ణకు జితేందర్, అతని అనుచరుడి రూపంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. జితేందర్ ను, అతని అనుచరులు ఎదుర్కొన్న కృష్ణను హతమార్చేందుకు ప్లాన్ వేసి.. ఓ ఘటనలో కృష్ణపై కాల్పులు జరుపుతారు. దాంతో కృష్ణ పరిస్థితి విషమంగా మారుతుంది. ఆ సంఘటన తర్వాతే సినిమాలో పెద్ద ట్విస్ట్ మొదలవుతుంది. ట్విస్ ఎమిటి? చావు బతుకుల పరిస్థితుల మధ్య ఉన్న కృష్ణ పరిస్థితి ఏమైంది. జితేందర్ ముఖ్యమంత్రి అయ్యాడా; జితేందర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎవరు అడ్డంకిగా మారారు అనే సందేహాలకు సినిమా చూడాల్సిందే.
కృష్ణ పాత్రలో బాలకృష్ణ మరోసారి విజృంభించాడు. కథకు తగినట్టుగా.. తనకు లభించిన క్యారెక్టర్ పండించడంలో బాలకృష్ణ సఫలమయ్యాడు. సింహా తర్వాత ఓ పవర్ ఫుల్ పాత్రతో బాలకృష్ణ అదగొట్టాడనే చెప్పవచ్చు. ఇక జితేందర్ పాత్రలో జగపతిబాబు తన రూట్ ను మార్చుకుని ఓ పవర్ ఫుల్ విలన్ పాత్రతో అద్బుతంగా రాణించాడు. జితేంద్ర పాత్ర లేకపోతే లెజెండ్ సినిమా లేదని ఓ అభిప్రాయాన్ని కలిగించే రేంజ్ లో జగపతిబాబు ప్రభావాన్ని చూపారు. తన ఇమేజ్ ను పక్కన పెట్టి ఓ కొత్త పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారడంలో సందేహం అక్కర్లేదు.
కథలో భాగంగా రాధికా ఆంప్టే, సోనాల్ చౌహాన్ లు పాటలకే పరిమితం కాకుండా పెర్పార్మెన్స్ కూడా అవకాశం లభించింది. మిగితా పాత్రలు తమ పాత్రల పరిమితి మేరకు పర్వాలేదనిపించారు.
రత్నం మాటలు, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, రామ్ ప్రసాద్ కెమెరా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ద్వితీయార్ధంలో రత్నం మాటలు తూటాల్ల పేలాయి.
మ్యూజిక్ రివ్యూ:
తొలిసారి బాలకృష్ణ చిత్రం కోసం మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు చేకూర్చారు. బాలకృష్ణను క్రేజ్ దృష్టిలో ఉంచుకుని రూపొందించిన 'సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసాడంటే వీడు' అనే టైటిల్ సాంగ్, మెలోడిగా రూపొందింన 'పట్టు చీర బాగుందే.. కట్టు బొట్టు బాగుందే' ఆడియోలో అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటలకు వచ్చిన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా తెర రూపం కల్పించారు. ఇక ఈ చిత్రంలో కీలకమైన పలు సన్నివేశాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో దేవి శ్రీ ప్రసాద్ జీవం పోశారు. ఈ చిత్ర ద్వితీయార్ధంలో దేవీ శ్రీ స్రసాద్ పనితీరు అద్బుతంగా ఉంది.
దర్శకుడి పనితీరు:
దమ్ము చిత్రంతో ఎదురెబ్బ తిన్న బోయపాటి శ్రీను లెజెండ్ చిత్రంలో చక్కటి స్క్రీన్ ప్లే, ఫర్ ఫెక్ట్ స్క్రిప్ట్ తో దూసుకుపోయాడు. తొలిభాగంలో కథ మామూలుగా నడిపించినా.. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఆతర్వాత ద్వితీయార్ధంలో సన్నివేశాలను పరిగెత్తించాడు. మంచి టేకింగ్ కు రత్నం మాటలు తోడవ్వడంతో ప్రేక్షకుడికి ఓ మంచి అనుభూతిని కలిగించారు. ఏది ఏమైనా కష్టకాలంలో బోయపాటి శ్రీను తొలి ఆటకే సానుకూలమైన టాక్ సంపాదించుకున్నారు. సింహా తర్వాత ఈ మధ్యకాలంలో సరియైన హిట్ సొంతం చేసుకోలేకపోయిన బాలకృష్ణకు ఊరట కలిగించే చిత్రాన్ని అందించడంలో బోయపాటి సఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే చిత్రంలో మితి మీరిన హింస, ఊహలకు అందిన ఫైట్స్ మైనస్ పాయింట్ చెప్పవచ్చు. పక్కా కమర్షియల్ హంగులతో, సెంటిమెంట్ తోపాటు, బాలకృష్ణ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన లెజెండ్ చిత్రం 'సింహా-2' అని చెప్పవచ్చు.
0 comments:
Post a Comment