హైదరాబాద్: సచివాలయంలో సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్) ముఖ్యమంత్రి కార్యాలయం ఛేంబర్‌ను వాస్తు ప్రకారం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్రకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు వాస్తు పట్టింపులున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తును దృష్టిలో పెట్టుకునే సీమాంధ్ర సీఎం చాంబర్‌ను తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించుకున్నారు.
రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం ఇప్పుడున్న సచివాలయం నుంచే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలన సాగిస్తారు. సి - బ్లాకులోని ప్రస్తుత ముఖ్యమంత్రి ఛేంబర్ తెలంగాణ ముఖ్యమంత్రికే కేటాయించే అవకాశం ఉంది. హెచ్-సౌత్ బ్లాకును సీమాంధ్ర ముఖ్యమంత్రికి కేటాయించనున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాస్తు ప్రకారం తన చాంబర్‌ను సీ-బ్లాక్‌లోని నాలుగో అంతస్తులో ఏర్పాటు చేసుకున్నారు. సచివాలయానికి ఉత్తరాన ఉన్న ప్రధాన ద్వారాన్ని చంద్రబాబు పడమరకు మార్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వాస్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులను చేయించారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి తన చాంబర్‌ను సీ-బ్లాక్‌లోని ఆరో అంతస్తులో అధిపతి నైరుతి దిశలో ఉండాలనే ఉద్దేశంతో ఓ మూలన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మరణానంతరం ముఖ్యమంత్రిగా వచ్చిన రోశయ్య, కిరణ్ అదే కార్యాలయాన్నే కొనసాగించారు. జగన్‌కు కూడా వాస్తు పట్టింపులున్నట్లు ఇప్పటికే రుజువైంది. పులివెందులలోని తన ఇంటికి వాస్తు దోషాన్ని సరిదిద్దుకున్నారు. ఇవన్నీ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు.
0 comments:
Post a Comment