ఆలూ లేదు చూలు లేదు అబ్బాయి పేరు సోమలింగం అన్న చందంగా మీడియా నిర్వాకం ఉందని ప్రియమణి రుసరుసలాడుతున్నారు. అంతగా ఆమె కారాలు మిరియాలు నూరడానికి కారణమేమింటంటారా? ఇంకేముంది ప్రియమణికి గర్భం అంటూ ప్రచారం జోరుగా జరగడమే. తొలి రోజుల్లోనే కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న మలయాళ బ్యూటీ ప్రియమణి పరుత్తి వీరన్ చిత్రంలో పల్లెటూరి పడుచుగా ఒదిగిపోయింది. ఈ పాత్ర పోషణకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్నారు. అయితే ఆ తరువాత గ్లామర్ మోజులో పడిపోయారు. అలా కొన్ని చిత్రాల్లో అందాలారబోసినా ఆ తరువాత అవకాశాలు ముఖం చాటేయడంతో తెలుగు, మలయాళం, కన్నడం చిత్రాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
టాలీవుడ్‌లో పెళ్లైన కొత్తలో, యమదొంగ వంటి కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించినా ప్రస్తుతం అక్కడా అవకాశాలు లేవు. దీంతో కన్నడ, మలయాళ చిత్రాలనే నమ్ముకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రియమణి రహస్య వివాహం చేసుకున్నారని ప్రస్తుతం ఆమె గర్భిణి అని ప్రచారం జరుగుతోంది. దీనికి స్పందించిన ప్రియమణి మీడియా తన కిష్టమొచ్చిన విధంగా వదంతులు మోసేస్తోందని ధ్వజమెత్తారు. తాను కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటం వల్లే తమిళ చిత్ర పరిశ్రమకు దూరం అయినట్లు వివరించారు. నిజానికి తనకు, తమిళంలోనూ అవకాశాలు వస్తున్నాయన్నారు.
అయితే కథలు నచ్చకపోవడంతో వాటిని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. మంచి కథా పాత్ర లభిస్తే తమిళంలో తప్పకుండా నటిస్తానని అన్నారు. తమిళచిత్ర పరిశ్రమకు కాస్త దూరంగా ఉండటం వల్ల తనపై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ప్రియమణి త్వరలోనే తమిళ తెరపై రీఎంట్రీ కానున్నట్లు సమాచారం. దర్శకుడు సముద్రకని తదుపరి చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఒక హీరోయిన్‌గా ఇప్పటికే అమలాపాల్ ఎంపికయ్యారు. రెండో హీరోయిన్‌గా ప్రియమణి నటించనున్నట్లు సమాచారం.
0 comments:
Post a Comment